కరీంనగర్, వెలుగు: వందేమాతరం గీతాన్ని అవమానిస్తున్న కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలను దేశం నుంచి తరిమికొట్టాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఆ పార్టీలకు దేశభక్తి లేదని ఫైర్అయ్యారు. మంగళవారం కరీంనగర్ టవర్ సర్కిల్ బీజేపీ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్‌లో వందేమాతరం గీతాన్ని పూర్తిగా ఆలపించేలా చట్టం చేసినా.. మధ్యలోనే ఆపేసి ఉల్లంఘించారని ఆరోపించారు.
ఇటలీ నుంచి భారత్‌కు వస్తే సరిపోదని, దేశ చరిత్ర, పోరాటాలు, సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకోవాలని అన్నారు. వందేమాతరం పాడకుండా సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే అడ్డుకునే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. ఎంఐఎం వందేమాతరాన్ని బహిష్కరిస్తోందని విమర్శించారు. మళ్లీ ఆ గీతాన్ని అవమానిస్తే హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి ఆలయం వద్ద లక్షలాది మందితో సామూహికంగా వందేమాతరం ఆలపిస్తామని చెప్పారు.
